
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు వ్యవహారం కొలిక్కివచ్చేలా కనిపించడం లేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎస్ఆర్సీ) 63 కాలేజీల ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 70 కాలేజీల్లో పాత ఫీజులను కొనసాగించడంతో పాటు దాదాపు 20 కాలేజీల్లో ఇప్పుడున్న ట్యూషన్ ఫీజుల్లో కోత విధించనున్నట్లు తెలుస్తోంది. 2025-28 బ్లాక్ పీరియడ్ కోసం జరిగిన ఫీజుల ఖరారు ప్రక్రియలో టీఏఎస్ఆర్సీ నిర్ణయాలపై పలు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. టీఏఎస్ఆర్సీ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు విషయంలో పారదర్శకత లోపించిందని పలు విద్యార్థి సంఘాలు సైతం నిరసనలు చేపట్టాయి. అధికారుల ఎలాంటి తనిఖీలు చేయకుండానే కొన్ని కాలేజీలకు ఫీజులు పెంచారనే విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. టీఏఎస్ఆర్సీ లో ఉన్నత విద్యాశాఖ అధికారుల జోక్యం ఎక్కువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 కాలేజీల్లో గతంలో ఉన్న ఫీజుల కంటే తక్కువ ఫీజులను కమిటీ నిర్ణయించింది. కొన్ని కాలేజీల్లో రూ.10వేల నుండి రూ.50 వేల వరకు కోత విధించినట్లు తెలుస్తోంది. మరో 70 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎటువంటి పెంపు లేకుండా గతంలో ఉన్న పాత ఫీజులనే కొనసాగించాలని టీఏఎస్ఆర్సీ నిర్ణయించింది. 36 కాలేజీల్లో రూ.10 వేల లోపు, మరో 18 కాలేజీల్లో రూ.10 వేల నుంచి రూ. 20 వేల లోపు, 9 కాలేజీల్లో రూ. 20 వేల నుంచి రూ.35 వేల లోపు పెంచారు. మొత్తంగా 152 కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ సంబంధిత జాబితాను టీఏఎస్ఆర్సీ కొన్ని నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. ఫీజుల ఖరారుకు సంబంధించి జీవో జారీ చేస్తే ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. అవి 2025-28 బ్లాక్ పీరియడ్ వరకు వర్తిస్తాయి.
ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని, ఖర్చులు విపరీతంగా పెరిగిన తరుణంలో ఫీజులు తగ్గించడం వల్ల నాణ్యమైన విద్యను అందించడం అసాధ్యమని కాలేజీల ప్రతినిధులు వాదిస్తున్నారు. ఫ్యాకల్టీ జీతాలు, మెయింటెనెన్స్ చార్జీలు పెరుగుతుంటే, ఫీజులు తగ్గించడం ఏంటని వాపోతున్నారు. టీఏఎస్ఆర్సీ అనుసరించిన విధానం శాస్త్రీయంగా లేదని, అందుకే కోర్టు ద్వారా న్యాయం పొందాలని భావిస్తున్నట్లు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, టీఏఎస్ఆర్సీ పంపిన తుది సిఫార్సులను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత, మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ఫీజుల జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జీవో వెలువడిన వెంటనే కాలేజీలు తమ తదుపరి కార్యాచరణను ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు, ఫీజులు పెరగకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫీజు తగ్గింపు జరిగిన కాలేజీల్లో చేరే పేద విద్యార్థులకు ఇది ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు