
ఢిల్లీ,, 23 ఫిబ్రవరి (హి.స.)
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గత కొద్ది నెలలుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా పాక్ సైన్యం.. ఆఫ్ఘాన్ పై వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో పదుల సంఖ్యలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అఫ్గానిస్థాన్ భూభాగంపై పాకిస్తాన్ తాజాగా జరిపిన వైమానిక దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై న్యూఢిల్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఇటువంటి దాడులకు పాల్పడటం అత్యంత విచారకరమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, బాధ్యతను ఇతరులపై నెట్టడానికి చేస్తున్న మరో ప్రయత్నం గా భారత్ ఈ దాడులను అభివర్ణించింది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచే ఇటువంటి చర్యలు ప్రాంతీయ స్థిరత్వానికి భంగం కలిగిస్తాయని భారత్ హెచ్చరించింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, పౌర మరణాలకు కారణమైన ఈ దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. ఉగ్రవాదం, సరిహద్దు భద్రత వంటి అంశాల్లో పాకిస్తాన్ అనుసరిస్తున్న తీరును భారత్ ఎండగట్టింది. అఫ్గాన్ ప్రజలకు భారత్ అండగా దేశ ప్రాంతీయ సమగ్రతను ఉంటుందని, గౌరవించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు