
న్యూఢిల్లీ, 24 ఫిబ్రవరి (హి.స.)
కేరళ రాష్ట్రం పేరును ఇకపై అధికారికంగా 'కేరళమ్' (Keralam) గా మార్చేందుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది.
కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. అయితే, రాష్ట్రం పేరును అధికారికంగా కేరళ నుంచి 'కేరళమ్'గా మార్చాలని కోరుతూ కేరళ శాసనసభ 2024 జూన్ 24న ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, మంగళవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో పేరు మార్పునకు ఆమోదం తెలిపింది.
'సేవా తీర్థ'లో తొలి కేబినెట్ భేటీ..
నూతనంగా ప్రారంభించిన ప్రధానమంత్రి కార్యాలయ (PMO) భవనం 'సేవా తీర్థ' లో జరిగిన తొలి కేబినెట్ సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. సేవా తీర్థా జరిగిన ఈ తొలి సమావేశంతో, ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం 140 కోట్ల మంది దేశవాసులకు సేవ చేసే స్ఫూర్తితోనే ఉంటుందని, దేశ నిర్మాణ విస్తృత లక్ష్యంతో ముడిపడి ఉంటుందని కేంద్ర కేబినెట్ తెలిపినట్లు వ్యాఖ్యానించారు. పౌరుల గౌరవం, సమానత్వం, న్యాయంతో పాలనను అనుసంధానించే నైతిక నిబద్ధతకు రాజ్యాంగ విలువలే మాకు నిదర్శనం అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు