
సంగారెడ్డి, 23 ఫిబ్రవరి (హి.స.)
పదో తరగతి వార్షిక పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణపై సమగ్ర సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 24,657 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, వీరి కోసం 123 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేసి, తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని స్పష్టం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీటి వసతి, పరిశుభ్రమైన వాతావరణం, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స సదుపాయం తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతి కేంద్రంలో ఫుల్ టైమ్ స్కావెంజర్ను నియమించి మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఎంఈఓలు పరీక్షా కేంద్రాలను ముందస్తుగా తనిఖీ చేసి అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలన్నారు. ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ షీట్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించరాదని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ పరీక్షలను అత్యంత బాధ్యతతో నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవిందురామ్, డీఎంఅండెచి డా. వసంత్ రావు, పోలీస్, ఆర్టీసీ, పోస్టల్, విద్యుత్, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..