సిరిసిల్ల మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గానికి సమస్యల సవాళ్లు
రాజన్న సిరిసిల్ల, 23 ఫిబ్రవరి (హి.స.) సిరిసిల్ల మున్సిపాలిటీ నూతన పాలకవర్గానికి పలు సమస్యలు సవాళ్లుగా మారనున్నాయి. పట్టణంలోని పలు కాలనీలు అభివృద్ధి నోచుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలీన గ్రామాల పరిస్థితి మరి దయనీయంగా ఉందన్న వాదనలు విన
Sircilla municipality


రాజన్న సిరిసిల్ల, 23 ఫిబ్రవరి (హి.స.)

సిరిసిల్ల మున్సిపాలిటీ నూతన పాలకవర్గానికి పలు సమస్యలు సవాళ్లుగా మారనున్నాయి. పట్టణంలోని పలు కాలనీలు అభివృద్ధి నోచుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలీన గ్రామాల పరిస్థితి మరి దయనీయంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పట్టణానికి పొంచి ఉన్న వరద ముప్పుకు శాశ్వత చర్యలు కరువయ్యాయి. వీటితోపాటు కొత్త సమస్యలు కొత్త పాలకవర్గానికి స్వాగతం పలుకుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ మున్సిపల్ పీఠం కైవసం చేసుకోవడం తో ప్రభుత్వం నిధులు మంజూరు చేసేనా.. సిరిసిల్ల అభివృద్ధి జరిగేనా.... అన్న అయోమయం రేకెత్తిస్తోంది. ఇన్ని సమస్యల నడుమ సిరిసిల్ల సిరిసిల్ల మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ఎలా ముందుకు వెళుతుందోనన్న చర్చ ఇప్పుడు సిరిసిల్లలో హాట్ టాపిక్ గా మారింది.

కొత్త పాలకవర్గానికి సమస్యల సవాళ్లు

సిరిసిల్ల బల్దియా పరిధిలోని చాలా వార్డుల్లో గత ప్రభుత్వం, గత పాలకవర్గ పాలనలో అభివృద్ధి జరగలేదని మొన్నటి మున్సిపల్ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏకంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బాబాజీ నగర్, జ్యోతి నగర్, పెద్దూరుతో పాటు చాలా కాలనీలలో కాలనీవాసులు తమ వార్డుల్లో అభివృద్ధి జరగలేదని స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ను ప్రశ్నించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు కనీసం మౌలిక వసతులు కల్పించడంలో గత పాలకవర్గ కౌన్సిలర్లు విఫలమయ్యారని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలా చాలా వార్డుల్లో సమస్యలు ఉండగా బతుకమ్మ ఘాటు, కొత్తచెరువు వద్ద మిగిలి ఉన్న పనులు పూర్తి చేయాల్సి ఉంది. పట్టణ ప్రజల ఆహ్లాద కోసం నిర్మించిన పార్కులు అధ్వాన్నంగా తయారయ్యాయి. వేసవికాలం సమీపించడంతో మంచినీటి కొరత ఏర్పడే సమస్య కూడా ఉంది. మున్సిపల్ పాలకవర్గం దిగిపోయి ఏడాది గడుస్తుండడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది.

ముప్పుకు శాశ్వత

వరద చర్యలు కరువు

ఇదిలా ఉంటే సిరిసిల్లలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా పట్టణం ముంపునకు గురవుతుంది. దానికి కారణం సిరిసిల్లలో ఉన్న చెరువులు కుంటలు వాటికి సంబంధించిన నాళాలు కబ్జాకు గురి కావడం అనేది జగమెరిగిన సత్యం. 2021 సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాలకు సిరిసిల్లలోని వెంకంపేట, పాత బస్టాండ్, సంజీవయ్య నగర్, ఆటో నగర్, శాంతి నగర్, శ్రీనగర్ కాలనీలతో పాటు పలు కాలనీలు పూర్తిగా నీట మునిగి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అప్పటి మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వరద పదవి వివిధ ప్రాంతాల్లో పర్యటించి సిరిసిల్లకు వరద ముప్పు రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఎన్ని ప్రణాళికలు తయారు చేసినా గత ప్రభుత్వంలో అవి కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో ప్రతి వర్షాకాలం కురిసే భారీ వర్షాలకు సిరిసిల్ల నీట మునిగడమే పరిపాటిగా మారిపోయింది. అంతేకాకుండా చిన్నపాటి వర్షానికే పట్టణంలోని నేతన్న చౌక్, పాత బస్టాండ్ వద్ద గల కరీంనగర్-సిరిసిల్ల ప్రధాన రహదారిలో భారీగా నీళ్లు గుమి గోడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

నిధుల అయోమయం

మంజూరుపై

రెండోసారి రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సిరిసిల్లలో మాత్రం మెజార్టీ వార్డులు గెలిచి బీఆర్ఎస్ సిరిసిల్ల మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ గా కళా చక్రపాణి బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు చిక్కు ఇప్పుడే మొదలైంది. ప్రభుత్వం సిరిసిల్ల అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించేనా అన్న అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. సిరిసిల్లకు నిధులు తీసుకురావడానికి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఎలా ముందుకు వెళ్తారన్న సందిగ్ధం పట్టణ ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ సిరిసిల్ల అభివృద్ధిలో నూతన పాలకవర్గ పాలన ఎలా కొనసాగుతుందని స్థానికంగా జోరుగా చర్చ కొనసాగుతోంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande