
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE) నిర్వహణకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,89,126 మంది, సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. ఇందుకోసం స్టేట్ వైడ్గా 1495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రైవేటు కాలేజీలతో పాటు 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలు కూడా ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందే, అంటే ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు వెబ్సైట్ (tgbie.cgg.gov.in) నుంచి లేదా కళాశాలల నుండి హాల్ టికెట్లు పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్లను అనుమతించాలని బోర్డు ఆదేశించింది.
ఇక సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్షా హాల్లోకి అనుమతించరు. మాల్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. విద్యార్థుల కోసం ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, ఫర్నిచర్, గోడ గడియారాలు వైద్య సహాయం అందుబాటులో ఉంటాయి. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా కోసం సుమారు 7,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని టీజీబీఐఈ (TGBIE) ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నేరుగా పర్యవేక్షిస్తారు. అలాగే, పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు