
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ల ఆదాయం
భారీగా పెరగడం పై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సాగుతుంది 'ప్రజా పాలన' కాదు, అది 'పెనాల్టీ పాలన' అని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. కేవలం ఏడాది కాలంలోనే చలానాల వసూళ్లు రూ. 108.33 కోట్ల నుంచి రూ. 275.05 కోట్లకు పెరగడాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రశ్నించారు. అంటే ఏడాది కాలంలోనే జరిమానాల ద్వారా వచ్చే ఆదాయం 154 శాతం అంటే దాదాపు 2.5 రెట్లు పెరిగిందని ఆయన గణాంకాలతో వివరించారు.
చలానాల ద్వారా వసూళ్లు 2.5 రెట్లు పెరిగినప్పుడు, రాష్ట్రంలో రోడ్లు కూడా అదే స్థాయిలో మెరుగుపడ్డాయా అని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్లపై గుంతలు మాయమయ్యాయా, ట్రాఫిక్ నిర్వహణ ఏమైనా మెరుగైందా అని నిలదీశారు. ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా కేవలం జరిమానాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టడం సరికాదన్నారు. సామాన్య ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 'వాకింగ్ ఏటీఎం'లా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా చలానాల మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల నుండి కట్ చేసే 'ఆటో- డెబిట్' విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తీవ్రంగా తప్పు పట్టారు. ముందుగా జరిమానాలు పెంచి, ఆపై పోలీసులకు టార్గెట్లు పెట్టి, ఇప్పుడు నేరుగా అకౌంట్ల నుండి డబ్బులు కట్ చేయాలని చూడటం 'ఆటోమేటెడ్ దోపిడీ' లా ఉందని ఆయన (Automated Extortion) విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాలను పునరాలోచించుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..