
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)
నగరాల్లో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, పేదలకు ఉపాధి లభించేలా వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఉద్దేశించిన 'అర్బన్ చాలెంజ్ ఫండ్(యూసీఎఫ్)'లో కేంద్ర ప్రభుత్వం ఈ సారి భారీగా కోత విధించింది. గతేడాది బడ్జెట్లో రూ.1.5 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఏడాది మాత్రం రూ.50వేల కోట్లకు కోతపెట్టి రూ. లక్ష కోట్లకు కుదించింది. రీ డెవలప్మెంట్ ఆఫ్ సిటీస్, గ్రోత్ కారిడార్లు, గ్రోత్ హబ్స్, వాటర్, శానిటేషన్, మురుగునీటి ప్రాజెక్టులకు మాత్రమే యూసీఎఫ్ నుంచి నిధులు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పట్టణాల అభివృద్ధి, గ్రోత్ కారిడార్లు, తాగునీటి సరఫరా, శానిటేషన్, మురుగు నీటి ప్రాజెక్టుల అమలుకు కేంద్రం నిధులపై భారీ ఆశలన్నీ పెట్టుకున్న అడియాసలయ్యాయి.
అర్బన్ చాలెంజ్ ఫండ్ నుంచి పట్టణ స్థానిక సంస్థలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఏ ప్రాజెక్టు కోసమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి 25 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ స్థానిక సంస్థ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, బోర్డు నుంచి 25 శాతం నిధులు తమ వాటాగా ఇవ్వాల్సిందే. మిగతా 50 శాతం నిధులను బాండ్లు, బ్యాంకు రుణాల రూపంలో సేకరించుకోవాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) ప్రాజెక్టులు అయితే సంబంధిత ఏజెన్సీ భరించనుంది. 50 శాతం నిధుల సేకరణ, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తేనే కేంద్ర ప్రభుత్వం అర్బన్ చాలెంజ్ ఫండ్ నుంచి నిధులు ఇవ్వనుందని అధికారులు చెబుతున్నారు.
అర్బన్ చాలెంజ్ ఫండ్ నుంచి నిధులు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా వివరాలు పంపించాలని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శికి లేఖలను సైతం పంపించింది. ప్రాజెక్టు స్టేటస్, ప్రాజెక్టు ఫీచర్స్, ఫిజికల్, ఫైనాన్సియల్ ప్రోగ్రెస్, ప్రాజెక్టు వ్యయం, కాన్సెప్ట్ ప్లాన్, డీపీఆర్, టెండర్ డాక్యుమెంట్, వర్క్ ఆర్డర్, ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ, పూర్తి చేయనున్న అంచనా తేదీలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించింది. ఆస్తిపన్ను ద్వారా ఆదాయం పెంచుకోవడం, యూజర్ చార్జీలు, అడ్వర్టైజ్మెంట్ చార్జీలు, సేల్ ఆఫ్ రీయూజ్ వాటర్, ఎనర్జీ వంటి వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటే ప్రోత్సాహకంగా కేంద్రం నిధులు ఇవ్వనుంది.
రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదనే విమర్శలూ లేకపోలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రబడ్జెట్లో నేరుగా నిధులు కేటాయించకపోయినా.. అర్బన్ చాలెంజ్ ఫండ్ నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే గతేడాది రూ.1.5 లక్షల కోట్ల ఫండ్లోనే నిధులు రాలేదని, ఈసారి రూ. లక్ష కోట్ల నుంచి రాష్ట్రానికి ఏమైనా నిధులు వస్తాయా? లేదా? అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కోసం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలోని సీడీఎంఏ, పబ్లిక్ హెల్త్ విభాగం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రోరైలు ప్రాజెక్టు, జలమండలి, కులీకుతూబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విభాగాల నుంచి ప్రతిపాదనలు పంపించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు