
రాజమండ్రి , 23 ఫిబ్రవరి (హి.స.)కల్తీపాల వ్యవహారం, ప్రజలకు అస్వస్థత మరణాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. కల్తీపాల వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులతో మాట్లాడి.. అనారోగ్యం బారిన పడిన, మరణించిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే రాజమండ్రి వెళ్లి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరణించినవారి పోస్టుమార్టం రిపోర్టుల్లో, చికిత్స పొందుతున్నవారి బ్లడ్ టెస్టు రిపోర్టుల్లో అనారోగ్యానికి కల్తీపాలే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని, ప్రస్తుతం బాధితులంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పాలు విక్రయించిన వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లలు, వయసుపైబడిన వారిపై కనిపిస్తోందని సీఎంకు వివరించారు. రాజమండ్రి చుట్టుపక్కల విక్రయదారులు 106 ఇళ్లకు పాలను పంపిణీ చేస్తున్నారని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV