
దిల్లీ: 24 ఫిబ్రవరి (హి.స.)
కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘‘ప్రహార్’’ పేరుతో దేశంలో తొలి ఉగ్రవాద నిర్మూలన విధానానికి తెరతీసింది. బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం వహించరాదన్నది ఈ విధానంలోని ప్రధాన అంశం. నిఘా ఆధారంగా ఉగ్రవాద హింసను నిరోధించడం, ఉగ్రవాదులకు, వారికి ఆర్థిక సాయం చేసేవారికి, మద్దతు దారులకు నిధులు, ఆయుధాలు, ఆశ్రయం అందకుండా చేయడం ఈ పథకం ఉద్దేశమని హోంశాఖ పేర్కొంది. దేశ విదేశాల నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పును నిర్మూలించేందుకు ఈ విధానానికి ఏడు స్తంభాల్లాంటి అంశాలను నిర్దేశించారు.
ఉగ్రవాద నిరోధం, సత్వర స్పందన, అంతర్గత సామర్థ్యాల వినియోగం, మానవహక్కులు, చట్టపాలన ఆధారిత పద్ధతుల అనుసరణ, ఉగ్రవాదానికి దారితీస్తున్న మత ఛాందస భావనల కట్టడి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలతో జతకలవడం అనే ఈ అంశాలు ప్రహార్కు పునాది వంటివని స్పష్టం చేసింది. భారత్ పొరుగున తరచూ అస్థిర పరిస్థితులు నెలకొంటున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో అరాచక పరిస్థితులు తలెత్తుతున్నాయి. మన ప్రాంతంలోని కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వ విధానంగా ఎంచుకున్నాయని హోంశాఖ తన విధాన పత్రంలో పాకిస్థాన్ను పరోక్షంగా ప్రస్తావించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ