
అమరావతి, 10 మార్చి (హి.స.)ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో పల్లెపండగ-2 పేరుతో గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన రోడ్లు, పంచాయతీ కార్యాలయ భవనాల నిర్మాణ పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. అన్ని పనులను ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని డ్వామా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు లక్ష్యం నిర్దేశించింది. పనులకు సంబంధించి రోజూ ప్రణాళికలు రూపొందించి అమరావతి నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
పల్లెపండగ-1 కింద గ్రామాల్లో ఉపాధి నిధులతో చేపట్టిన పనుల తాలూకూ బిల్లులు ప్రభుత్వం గత నవంబరులోనే పూర్తిగా చెల్లించింది. పల్లెపండగ-2 కింద కొత్త పనులు మంజూరు చేసింది. పల్లెల్లో సిమెంటు, తారు రోడ్లు, పంచాయతీ కార్యాలయాలు, గోకులం షెడ్లు నిర్మిస్తున్నారు. నరేగా స్థానంలో ఏప్రిల్ ఒకటి నుంచి వీబీజీరామ్జీని కేంద్రం ప్రవేశపెడుతోంది. నరేగా కింద గ్రామాల్లో చేస్తున్న ప్రగతి పనులకు కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. వీబీజీరామ్జీ అమలులోకి వచ్చిన తర్వాత కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు మంజూరు చేయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నరేగా కింద సాధ్యమైనన్ని ఎక్కువ పనులు చేపట్టి కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ