రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు.. బండి సంజయ్ హెచ్చరిక
రంగనాయక్ సాగర్ నుంచి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కాలువ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు.
Bandi sanjay


హైదరాబాద్, 10 మార్చి (హి.స.)రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంగనాయక్ సాగర్ కెనాల్ పనులు పూర్తి చేయాలంటూ నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. ఈరోజు(మంగళవారం) కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే వారిని అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. రంగనాయక్ సాగర్ నుంచి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కాలువ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని కేంద్రమంత్రి ప్రశ్నించారు. రూ.3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులు ఎందుకు ప్రారంభించలేదని అడిగారు

కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరు అందేదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాల వల్ల రైతులు వరుసగా పంటలు నష్టపోతున్నారని కేంద్రమంత్రి అన్నారు. తక్షణమే పనులు ప్రారంభించకపోతే ఆయా ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు.

రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీ సహా పార్టీ నాయకులను స్టేషన్కు తరలించడం అక్రమమని కేంద్రమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలన్నారు. రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుంచి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కాలువ పనులను పూర్తి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande