మెనూ పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, 10 మార్చి (హి.స.) విద్యార్థుల ఆరోగ్యం, విద్యా నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. మంగళవారం బూర్గంపాడు మండల కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళా
Bhadradari collector


భద్రాద్రి కొత్తగూడెం, 10 మార్చి (హి.స.)

విద్యార్థుల ఆరోగ్యం, విద్యా నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. మంగళవారం బూర్గంపాడు మండల కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని (కేజీబీవీ) మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు.

రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో ఉన్న ఒక ఐస్క్రీమ్ బండిని గమనించిన కలెక్టర్, నేరుగా అక్కడికి వెళ్లి విక్రయిస్తున్న ఐస్క్రీమ్ నాణ్యతను, వాటి గడువు తేదీలను స్వయంగా తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించవద్దని హెచ్చరించారు. బయట నుంచి వచ్చే ఆహార పదార్థాలను పాఠశాలల్లోకి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు.

అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్, అక్కడ వంటశాల, కిచెన్ షెడ్ను పరిశీలించారు. మెనూ ప్రకారం.. ఉండాల్సిన కొన్ని ఆహార పదార్థాలు అందుబాటులో లేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ఉదయం వేళల్లో రాగి జావ, పల్లి పట్టు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి, వారికి స్నాక్స్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.

విద్యార్థుల పఠన సామర్థ్య పరిశీలన

రూపొందించాలని తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్, వారి ఇంగ్లీష్ పఠన సామర్థ్యాన్ని పరీక్షించారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలోని మరుగుదొడ్లను రోజుకు మూడు సార్లు శుభ్రపరచాలని, పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తోపాటు పాఠశాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande