
నల్గొండ, 10 మార్చి (హి.స.)
మహిళలకు సమానత్వం సాధికారత లభించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేవరకొండ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన తన సతీమణి శ్రీమతి జ్యోతి ప్రసన్న బాలు నాయక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ మహిళా ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికా విద్య కోసం కృషి చేసిన సావిత్రి భాయి పూలె, దుర్గా భాయ్ దేశ్ ముఖ్ వంటి వారిని, అన్యాయంపై పోరాడిన సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మలను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారో, ఆ సమాజం వేగంగా ప్రగతి పథంలో పయనిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, తెలంగాణలో అమలువుతున్న మెజారిటీ సంక్షేమ పథకాలు మహిళల పేరు మీదనే ఉండటం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు టీ. నర్సింహా, కార్యదర్శి చంద్రమౌళి, పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..