ఇంజినీరింగ్ కళాశాలలకు సర్కారు మరో షాక్
గతంలో పలు అదనపు రుసుములకు వెసులుబాటు ఈసారి ట్యూషన్ ఫీజు తప్ప.. రూపాయి కూడా వసూలు చేయొద్దని జీఓ ఇతర కోర్సులకూ ఇదే తరహాలో ఉత్తర్వులు
Engineering college


హైదరాబాద్, 10 మార్చి (హి.స.)తెలంగాణలోని ఇంజినీరింగ్తో పాటు ఫార్మసీ, లా, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలకు రాష్ట్ర సర్కారు ఊహించని షాక్ ఇచ్చింది. అనేక కళాశాలలకు ఫీజు పెంచకపోవడంతో పాటు కొన్ని కళాశాలలకు ఇప్పటివరకు ఉన్న ఫీజునే తగ్గించిన విషయం తెలిసిందే. కొన్నింటికి దాదాపు సగం ఫీజు తగ్గించారు. ఆ షాక్ నుంచి యాజమాన్యాలు తేరుకోలేదు. అదే సమయంలో ఈసారి ట్యూషన్ ఫీజు తప్ప.. ఇతర పేర్లతో ఒక్క రూపాయి కూడా వసూలు చేయడానికి వీల్లేదని కొత్త ఫీజుల జీఓల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ట్యూషన్ ఫీజుతోపాటు బీటెక్కు వివిధ రకాల పేరిట విద్యార్థుల నుంచి అదనంగా రూ.8,500 వసూలు చేసుకునే వీలుండేది.

అందులో రూ.2 వేలు కళాశాలలు విశ్వవిద్యాలయాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల్లో జీఓలో ప్రత్యేక ఫీజులను కూడా పొందుపరిచేవారు. ఈసారి జీఓల్లో వాటి ప్రస్తావన లేదు. ట్యూషన్ ఫీజులో స్పెషల్ ఫీజు, అడ్మిషన్ ఫీజును చేర్చలేదని, ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) కోరినట్లు జీఓలో ఉంది. అయితే విద్యాశాఖ వర్గాలు మాత్రం తమకు టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించిన ఫీజులనే ఖరారు చేశామని, ప్రత్యేక రుసుములను సిఫార్సు చేయలేదని పేర్కొంటున్నాయి. దీనిపై టీఏఎఫ్ఆర్సీ వర్గాలు ప్రత్యేక ఫీజులపై ఉన్నతాధికారులతో చర్చించి.. స్పష్టతనిస్తామని వ్యాఖ్యానించాయి.

అధికారికంగా ఇప్పటివరకు బీటెక్ విద్యార్థుల నుంచి ఆయా కళాశాలలు రూ.8,500 చొప్పున వసూలు చేయవచ్చు. కానీ రకరకాల పేర్లు చెప్పి అనధికారికంగా రూ.12,000-రూ.16,000 వరకు పలు కాలేజీలు వసూలు చేస్తున్నాయి. ఆ ప్రకారం ఏటా కనీసం రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు అదనంగా పొందుతున్నట్లు అంచనా. ఇతర కోర్సులను కూడా కలిపితే రూ.100 కోట్లు దాటతాయి. కొత్త ఫీజులను ఖరారు చేసే ముందు విద్యాశాఖ, టీఏఎఫ్ఆర్సీ వర్గాల్లో రకరకాల చర్చలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ట్యూషన్ ఫీజు తప్ప.. మిగిలినవి వద్దని అంతర్గతంగా భావించినట్లు తెలుస్తోంది. అందుకే టీఏఎఫ్ఆర్సీ వాటిని సిఫార్సు చేయలేదని, విద్యాశాఖ జీఓలో ప్రస్తావించలేదని భావిస్తున్నారు. కళాశాలల యాజమాన్యాలు మాత్రం కొన్నిరకాల ఫీజులను తీసుకోవచ్చని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande