
హైదరాబాద్, 10 మార్చి (హి.స.)
హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే ఏడాది రాబోయే గోదావరి పుష్కరాలను భక్తులకు సౌకర్యవంతంగా, భద్రంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారి సౌకర్యాలు, తాగునీరు, పారిశుధ్యం, రవాణా మరియు ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై ఆయా శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
కందకుర్తిలో మొదలై భద్రాచలం వరకు..
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించి గోదావరి నది ప్రాంత సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్గా మంత్రులు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ వేశారు. రోడ్లు భవనాలు శాఖ ఈ పుష్కర ఏర్పాట్లలో కీలక భూమిక పోషించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మికతకు, టెంపుల్ టూరిజానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. గోదావరి నది మహారాష్ట్రలో పుట్టినా.. నది పరివాహకం ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. గోదావరి ఆది వరకు కొనసాగుతాయి కాబట్టి అన్ని విభాగాలు అలెర్ట్ ఉండాలి. నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో మొదలై భద్రాచలం వరకు ప్రవహిస్తుంది.. ఈ వందల కిలోమీటర్ల ప్రాంతంలో ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు(బాసరా, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, భద్రాచలం) ఎంతో చరిత్ర కలిగిన గుడులు ఉన్నాయి.
పుష్కర ఘాట్లు నిర్మాణం..
కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే పవిత్రనది గోదావరి. ఈ గోదావరి నదిని తెలంగాణ గంగా నదిగా పిలుచుకుంటాం.. కాబట్టి రానున్న పుష్కరాలు అంతే స్థాయిలో నిర్వహించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలి. పుష్కరాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ అన్ని విధాల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హ్యామ్ మోడల్ రోడ్లు కనెక్టివిటీతో పాటు, అవసరమైన కాంక్రీట్ రోడ్లు, పుష్కర ఘాట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు ఉండాలి. అవసరమైన పుష్కర ఘాట్లు, ఘాట్లకు వెళ్ళే రహదారులు, మౌళిక సదుపాయాలు పై దృష్టి సారించాలి. ప్రధానంగా వాహనాల రాకపోకలు, ట్రాఫిక్, వాహనాల పార్కింగ్పై దృష్టి సారించాలి. అందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు, పోలీసు యంత్రాగం సమన్వయంతో వచ్చే మీటింగ్ నాటికి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలి. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..