
మెదక్, 10 మార్చి (హి.స.)
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం చిన్న శంకరంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీ చేశారు. కార్యాలయంలోని తహసీల్దార్ మాలతీని కార్యాలయంలోని పరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. క్లియరెన్స్, రికార్డ్ గదిలోకి వెళ్లి ఫైళ్లను పలు రికార్డులను పరిశీలించారు. ధరణి సంబంధించిన పట్టా మార్పిడి పట్టాలను తదితర ధృవ పథకాలను పరిశీలించారు. ధరణిలో రైతులకు సంబంధించి మార్పు చేర్పులు గురించి తెలుసుకున్నారు. కార్యాలయంలోని గదులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మండల కేంద్రంలోని మూడో నెంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్ రాణికి సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటించి కాలనీల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరచడం, రోడ్లను శుభ్రంగా ఉంచడం వంటి పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతీ, ఆర్ ఐ రాజు, వినయ్, సిబ్బంది ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..