పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాలు బాహాబాహి.. రంగంలోకి దిగిన పోలీసులు
పోలీస్ స్టేషన్లోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇరు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
Police station


హైదరాబాద్, 10 మార్చి (హి.స.)పోలీస్ స్టేషన్లోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇరు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో వారికి గాయాలయ్యాయి. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దాంతో ఆ భార్య భర్తలు విడివిడిగా నివసిస్తున్నారు. తన భర్త కొడుతున్నారంటూ భార్య జ్యోతి తుఫ్రాన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. తన భార్యను ఇంటికి పంపాలంటూ జ్యోతి భర్త ఉదయ కిరణ్ మంగళవారం ఘర్షణకు దిగాడు. దీంతో ఇరు కుటుంబాల సభ్యుల మధ్య మాటా మాటా పెరిగి.. ఈ ఘర్షణకు దారి తీసింది.

తూప్రాన్ మండలం అల్లాపురానికి చెందిన జ్యోతికి, చేగుంట మండలం రాంపూర్కు చెందిన ఉదయ్ కిరణ్లకు గతంలో వివాహమైంది. నాటి నుంచి ఈ దంపతుల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తాయి. దాంతో పలుమార్లు పెద్దలు పంచాయతీ పెట్టి.. దంపతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

భార్యాభర్తలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కు పిలిపించారు. దీంతో వీరితో పాటు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు సైతం పోలీస్ స్టేషన్కు తరలి వచ్చారు. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పలువురికి ఏం జరుగుతుందో తొలుత అర్థం కాని పరిస్థితి నెలకొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి లాఠీ చార్జి చేశారు. ఈ ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అక్కడి నుంచి పంపేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande