శాంతిభద్రతలతోనే ప్రగతి
కొత్త సవాళ్లకు పోలీసులు సిద్ధంగా ఉండాలి పనితీరు ఆధారంగా ఎ, బి, సిలుగా వర్గీకరణ రీట్రీట్-2026లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, డీజీపీ శివధర్రెడ్డి. చిత్రంలో శిఖాగోయల్, వికా
Revanthreddy


హైదరాబాద్, 10 మార్చి (హి.స.)శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, వాటిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీలో రెండు రోజులపాటు ‘ఫ్యూచర్రెడీ పోలీసింగ్’ పేరుతో ‘రీట్రీట్-2026’ నిర్వహించారు. సోమవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘శాంతిభద్రతలు బాగున్న రాష్ట్రాలు, దేశాలే ప్రగతి బాట పడతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సైబర్ నేరాలు, డ్రగ్స్ రూపంలో వస్తున్న కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. పైరవీలకు తావు లేకుండా.. పనితీరు ప్రాతిపదికన పోలీసు అధికారులను ఇప్పటికే ఎ, బి, సి కేటగిరీలుగా విభజించి... రూపొందించిన జాబితా నా వద్ద ఉంది. దాని ఆధారంగానే బదిలీలు చేస్తున్నాం.

పాలసీ లేకుంటే... పాలనాపరమైన స్తబ్దత

ఒక పాలసీ అంటూ లేకపోతే.. పరిపాలనపరమైన స్తబ్దత వస్తుంది. అందుకే రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దేందుకు ‘తెలంగాణ రైజింగ్-2047’ అనే పాలసీకి రూపకల్పన చేశాం. దేశం వందేళ్ల స్వాతంత్య్ర సంబరాలు నిర్వహించుకునే నాటికి మన రాష్ట్రాన్ని ప్రపంచానికి తలమానికంగా నిలపడమే దీని ఉద్దేశం. ముందుచూపు లేకపోవడంతోనే ప్రస్తుతం దేశంలోని మెట్రో నగరాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అందుకే తెలంగాణకు ప్రత్యేక పాలసీ రూపొందించాం. సమస్యను పరిష్కరించాలంటే ముందు దాన్ని అర్థం చేసుకొని సమయం కేటాయించాలి. వేగంగా పరిగెత్తితే ఉపయోగం లేకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అందుకే సవాళ్లపై చర్చించేందుకు ‘రీట్రీట్-2026’ ఏర్పాటు చేయడం అభినందనీయం.

సీఎం రేవంత్రెడ్డి, డీజీపీ శివధర్రెడ్డిలతో ఎస్పీలు, డీఐజీ, ఐజీలు, పోలీస్ కమిషనర్లు, అదనపు డీజీల గ్రూప్ ఫొటో

ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ

ఈ సదస్సులో వచ్చిన ప్రతిపాదనలకు కార్యరూపం ఇచ్చేందుకు సీఎస్ ఆధ్వర్యంలో డీజీపీ, రవాణా, ఆర్థిక శాఖల కార్యదర్శులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయాలి. సాంకేతిక, న్యాయ, ఆర్థిక సమస్యలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. ప్రజల ప్రవర్తనలో మార్పు రాకుంటే ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం ఉండదు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పోలీసుశాఖను క్రమబద్ధీకరించాలి. జనాభాకు తగ్గట్టుగా సిబ్బందిని నియమించుకోవాలి. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం తగ్గిన నేపథ్యంలో గ్రేహౌండ్స్ సిబ్బందిని ఇతర అవసరాలకు వినియోగించుకోండి. హైదరాబాద్లో పోలీసు, మున్సిపల్ శాఖల మధ్య మరింత సమన్వయం సాధించేందుకు మూడు కమిషనరేట్లు, మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. త్వరలో మిగతా ప్రభుత్వ శాఖలనూ ఇదే పద్ధతిలో సర్దుబాటు చేస్తాం’’ అని తెలిపారు.

రెండేళ్లలో అనేక సంస్కరణలు: డీజీపీ

డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ... ‘‘రెండేళ్ల కాలంలో పోలీసు శాఖకు సంబంధించి ప్రభుత్వం అనేక సంస్కరణలు తెచ్చింది. అంతకుముందు అనేక మంది ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి పోస్టింగులు లేకుండా కార్యాలయానికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ఒక్క అధికారి కూడా ఖాళీగా లేరు. బదిలీలు, పదోన్నతులు సకాలంలో జరిగిపోతున్నాయి. పోలీసు శాఖ పనితీరును మదింపు చేసి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు రీట్రీట్ నిర్వహిస్తున్నాం’’ అని వెల్లడించారు. రవాణా శాఖ కార్యదర్శి వికాస్రాజ్ మాట్లాడుతూ... ‘‘రహదారి భద్రతపై పోలీసులతో కలిసి పనిచేస్తాం. వాహనాల ఫిట్నెస్ను పరీక్షించే విధానాన్ని ఆధునికీకరిస్తున్నాం. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నాం’’ అని వివరించారు. కార్యక్రమంలో పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, అన్ని జిల్లాల ఎస్సీలు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బాలలపై జరిగే నేరాల నియంత్రణకు...

బాలలపై జరిగే నేరాలను నివారించే లక్ష్యంతో యునిసెఫ్తో పోలీసు అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ‘చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టం స్ట్రెంగ్తెనింగ్ యూనిట్’ ఏర్పాటు చేసి పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ‘లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం’ యాప్ను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.

సరికొత్త పోలీసింగ్కు రీట్రీట్-2026 ప్రతిపాదనలు

రాష్ట్రంలో మారుతున్న నేరాల సరళి, ప్రజలే కేంద్రంగా మరింత సమర్థ పోలీసింగ్ను అందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ సీఎం రేవంత్రెడ్డికి నివేదిక అందించింది. రీట్రీట్-2026 పేరుతో నిర్వహించిన రెండు రోజుల సదస్సులో ప్రధానంగా ఆరు అంశాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎస్పీలు, ఆపై స్థాయి అధికారులంతా హాజరైన ఈ సదస్సులో.. సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, మహిళా భద్రత, వ్యవస్థీకృత నేరాలు, ట్రాఫిక్, విపత్తులపై విస్తృతంగా చర్చించారు. ప్రతి అంశంపై డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో చర్చలు జరిగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande