
విజయవాడ 11 మార్చి (హి.స.)మాజీ ఎంపీ నందిగం సురేశ్పై( విజయవాడ సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఓ చర్చి ట్రస్ట్ రెన్యువల్ కోసం డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ట్రస్ట్ మెంబర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ సీబీఎన్సీ చర్చి ట్రస్ట్ రెన్యువల్ కోసం మాజీ ఎంపీని ట్రస్ట్ మెంబర్ ఆశ్రయించారు. ఇందుకోసం మాజీ ఎంపీ రూ.25 లక్షలు తీసుకున్నారని బాధితుడు తెలిపారు.
రూ.25 లక్షలు తీసుకొని కూడా ట్రస్ట్ రెన్యువల్ చేయించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ మాజీ ఎంపీపై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. 2021లో ట్రస్ట్ సభ్యులతో కలిసి నందిగాం సురేశ్కు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసంలో రూ.25 లక్షలు ఇచ్చినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగినట్లు ట్రస్ట్ మెంబర్ తెలిపారు. ఈ క్రమంలో మాజీ ఎంపీపై 318(4), 351(2) సెక్షన్ల కింద సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ