
బాపట్ల 11 మార్చి (హి.స.) అమరావతిలోని సచివాలయంలో బుధ, గురువారాల్లో సీఎం నిర్వహిస్తున్న సదస్సులో జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై రూపొందించిన మాస్టర్ ప్లాన్ను కలెక్టర్ వినోద్కుమార్ వివరించనున్నారు. ప్రస్తావించాల్సిన ముఖ్యమైన అంశాలపై సమగ్ర నివేదికను కలెక్టర్ సిద్ధం చేసి తీసుకెళ్తున్నారు. సూర్యలంక కేంద్రంగా బీచ్ పర్యాటక హబ్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ వినోద్కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం ఇటీవల గోవాలో పర్యటించి అక్కడి పర్యాటక విధానాలను అధ్యయనం చేసి వచ్చింది. దీనిపై సమగ్ర నివేదిక రూపొందించి ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశారు.
సూర్యలంక నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు త్వరలో కేరళ అలెప్పీ తరహాలో హౌస్ బోటింగ్ను ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టనున్నారు. దీనికోసం బాపట్ల మండలం హైదర్పేట వద్ద నల్లమడ వాగు సమీపంలో హౌస్ బోటు నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. త్వరగా వీటి నిర్మాణం పూర్తి చేసి పడవల్లో విహారాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పర్యాటక మాస్టర్ ప్రణాళిక అమలుపై సీఎం మార్గనిర్దేశం చేయనున్నారు. సూర్యలంకలో రూ.97.52 కోట్లతో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ