
హైదరాబాద్, 11 మార్చి (హి.స.)ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని భాజపా ఎంపీ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ పేరుతో కాలం వెళ్లబుచ్చి.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా క్లీన్చిట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణను పార్టీ ఫిరాయింపులకు ఒక ప్రయోగశాలగా తయారు చేశారన్నారు. స్వయంగా కండువాలు కప్పిన సీఎం ఇప్పుడు నోరు మెదపకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
‘‘నైతిక విలువలకు, ప్రజా తీర్పునకు గౌరవం ఇచ్చే పార్టీ భాజపా. ఒక్క సీటుతో ప్రభుత్వాన్ని కోల్పోతామని తెలిసి కూడా ఫిరాయింపులను అప్పటి ప్రధాని వాజ్పేయీ ప్రోత్సహించలేదు. ఎప్పుడూ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్యకు జవాబు చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన స్పీకర్.. మచ్చ తెచ్చేలా వ్యవహరించారు. తెలంగాణలో అంబేడ్కర్ రాజ్యాంగం కాదు.. రేవంత్రెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. పార్లమెంటులో రాహుల్ గాంధీ నీతులు చెప్తారు, కానీ ఆయన పార్టీకి చెందిన నేతలు మాత్రం ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఫిరాయింపుల విషయంలో.. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మా వంతు పోరాటం చేస్తాం. న్యాయపరంగా పోరాటం చేస్తూనే కాంగ్రెస్ వ్యవహారశైలిని ప్రజల్లోకి తీసుకెళ్తాం’’ అని లక్ష్మణ్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్