
హైదరాబాద్, 11 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు, గ్యాస్ కొరతపై చర్చ జరుగుతోంది. మన వంటింటిపై కూడా ఆ ప్రభావం పడుతుందనే అంచనాలున్నాయి. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే గ్యాస్ కొరత మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున పొదుపు పాటించాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వంట గ్యాస్ ఆదా చేసుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి
ఇండక్షన్ స్టవ్: విద్యుత్తుతో పనిచేస్తుంది. వంటను వేగంగా చేసుకోవచ్చు. గ్యాస్ కంటే తక్కువ ఖర్చవుతుంది.
సోలార్ కుక్కర్: సూర్యరశ్మిని ఉపయోగించి ఖర్చులేకుండా వంట చేసుకోవచ్చు.
ఎలక్ట్రిక్ కుక్కర్/హాట్ ప్లేట్: అన్నం, కూరలు వంటి వాటిని సులభంగా వండుకోవచ్చు.
ఇన్ఫ్రారెడ్ స్టవ్: ఇది విద్యుత్తుతో పనిచేస్తుంది. ఏదైనా పాత్ర వీటిపై పెట్టి వంట చేసుకోవచ్చు.
మార్కెట్లో విద్యుత్తుతో నడిచే పొయ్యిలు (ఇండక్షన్ కుక్టాప్లు) ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ వీటి వాడకం పరిమితంగానే ఉంది. ఇళ్లలో చాలా తక్కువే. మంట వచ్చే స్టౌవ్లపై ఆంక్షలు ఉండటంతో మెట్రోస్టేషన్ల వంటి ప్రాంతాల్లో మాత్రం వాడుతున్నారు. ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ కొరతతో హోటళ్ల నిర్వాహకులు వీటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే టీ, కాఫీ వంటి వాటిని తాతాల్కికంగా నిలిపేయాలని హైదరాబాద్లోని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇండక్షన్ కుక్టాప్లను గ్యాస్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో విక్రయాలు పెరిగాయి. వీటి గురించి పెద్దగా తెలియని చాయ్వాలాలు సైతం తెలుసుకుని మరీ కొనే ప్రయత్నం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్