
హైదరాబాద్, 11 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన కొరత నెలకొంది. గ్యాస్ సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరిగింది. మరో రెండు రోజుల్లో గ్యాస్ సమస్య తీవ్రతరం కానుందని హాస్టల్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్లో హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంచకపోతే హాస్టళ్లలో వంట చేసే పరిస్థితి లేదన్నారు. నగర వ్యాప్తంగా దాదాపు 11వేల హాస్టల్స్ ఉన్నాయని.. అందులో 10 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉంటున్నారని పేర్కొన్నారు.
‘‘వారం రోజులుగా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచారు. ధర పెరిగినా గ్యాస్ కొని హాస్టళ్లలో ఉంటున్న వారికి వంట చేసి అందిస్తాం. అయితే, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ మాత్రం కొరత ఉందని సరఫరా చేయడం లేదు. నగరంలో గ్యాస్ సిలిండర్లు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వంటలు వండటానికి సమయం పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని కొరత లేకుండా చూడాలి. హాస్టళ్లలో కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించేలా అనుమతులు ఇవ్వాలి’’ అని కోరారు.
గ్యాస్ కొరత వేళ.. ఇంట్లో వినియోగించే డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ సిలిండర్ల స్థానంలో వినియోగిస్తున్నారు. ఈ అంశంపై పలువురు సమాచారం ఇవ్వడంతో పౌరసరఫరాల శాఖ సర్కిల్-6 పరిధిలో అధికారులు తనిఖీలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్