మాజీ మావోయిస్టులకు ఎన్ఐఏ షాక్.. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు...
హుజురాబాద్, 11 మార్చి (హి.స.) మావోయిస్టు అగ్రనేత అంత్యక్రియలకు హాజరైన ఘటనలో మాజీ మావోయిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) షాక్ ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు మాజీ నక్సలైట్లకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు స్థానికంగా
Mavoists


హుజురాబాద్, 11 మార్చి (హి.స.)

మావోయిస్టు అగ్రనేత అంత్యక్రియలకు హాజరైన ఘటనలో మాజీ మావోయిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) షాక్ ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు మాజీ నక్సలైట్లకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన ఓగ్గే చంద్రమౌళితో పాటు, హుజూరాబాద్ పట్టణానికి చెందిన పలువురు మాజీలకు ఈ నోటీసులు అందాయి. ఎఫ్ ఐ ఆర్ 4/25 కేసు దర్యాప్తులో భాగంగా.. వారి వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు ఈ నెల 25న హైదరాబాద్ లోని ఎన్ఐఏ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఎన్ఐఏ డిప్యూటీ సూపరింటెండెంట్ కాకి రాహుల్ తేజ పేరుతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఒకవేళ 25న హాజరుకాలేని పక్షంలో ఈ నెల 15వ తేదీలోపు స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలగుంటపల్లెకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఛత్తీస్గఢ్ ని అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో జరగగా, దానికి మాజీ పీపుల్స్ వార్ నాయకుడు గాదె ఇన్నయ్యతో పాటు పలువురు మాజీ మావోయిస్టులకుహాజరయ్యారు. ఆ సమయంలో గాదె ఇన్నయ్య కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపింది. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి సమాచారం సేకరించేందుకు అంత్యక్రియలకు వెళ్లిన వారందరికీ ఎన్ఐఏ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నోటీసులు అందుకున్న వారిని ఎన్ఐఏ కేవలం సాక్షులుగా పరిగణించి విచారిస్తుందా? లేక విచారణ అనంతరం వారిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందా? అనే ఉత్కంఠ హుజూరాబాద్ ప్రాంతంలో నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande