
హైదరాబాద్, 11 మార్చి (హి.స.)
ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో భారీ
స్థాయిలో మోసాలకు పాల్పడుతున్న నలుగురు ప్రధాన నిందితులను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులను మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు మహమ్మద్ సయీద్ ఉద్దీన్ అలియాస్ ఫరీద్ (26), మహమ్మద్ తాజుద్దీన్ (31), మహమ్మద్ యూనస్ అలియాస్ అర్బాజ్ (25), ఎండి. అయూబ్ (24)గా గుర్తించారు. వీరు హైదరాబాద్లోని ఫతేషా నగర్, ఈది బజార్, మోయిన్బాగ్ ప్రాంతాలకు చెందినవారని తెలిపారు.
హైదరాబాద్కు చెందిన 36 ఏళ్ల వ్యక్తిని బెటినెక్స్చేంజ్ ” ప్రతినిధులమని చెప్పుకుంటూ వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించిన మోసగాళ్లు క్రికెట్ బెట్టింగ్, తీన్ పట్టి, క్యాసినో వంటి ఆటల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. మొదటగా రూ.20,001 డిపాజిట్ చేయించగా రూ.5,000 లాభం చూపించి బాధితుడి నమ్మకాన్ని పొందారు. ఆ తర్వాత మోసగాళ్ల మాటలకు లోనైన బాధితుడు, తన భార్య బ్యాంక్ ఖాతాల నుండి 2025 నుండి 2026 జనవరి వరకు వివిధ యూపీఐ ఐడీలు, క్యూ ఆర్ కోడ్లు, క్యాష్ డిపాజిట్ మిషన్ల ద్వారా సుమారు రూ.1.5 కోట్ల వరకు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. ప్రారంభంలో రూ.20 లక్షల లాభం చూపించినప్పటికీ చివరికి మొత్తం డబ్బును కోల్పోయాడు.
బాధితుడు డబ్బును వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించిన ప్రతిసారి మోసగాళ్లు బెటినెక్స్ .కమ్,
ఫ్యూనినెక్స్చేంజ్ వంటి కొత్త డొమైన్ పేర్లతో వెబ్సైట్లను మార్చుతూ అతడిని తప్పుదోవ పట్టించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు ఫరీద్ గతంలో దుబాయ్ లోని క్రికెట్ బెట్టింగ్ కాల్ సెంటర్లో పనిచేసిన అనుభవంతో భారత్కు వచ్చి స్థానికంగా ఉన్న వ్యక్తుల నుంచి ఒక్కో సిమ్ కార్డుకు రూ.600 ఇస్తానని ఆశ చూపి సిమ్ కార్డులు సేకరించాడు. మిగిలిన నిందితులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని అతనికి అందజేశారు.
తరువాత ఫరీద్ ఆ సిమ్ కార్డులను దుబాచ్లో ఉన్న గుజరాత్కు చెందిన ముదస్సిర్కు ఒక్కో సిమ్ కార్డు రూ.1200 చొప్పున విక్రయించాడు. ఈ విధంగా సుమారు 250 సిమ్ కార్డులను సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సిమ్ కార్డులను ఉపయోగించి నకిలీ బెట్టింగ్ వెబ్సైట్లు సృష్టించి, కస్టమర్ కేర్ ప్రతినిధులుగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. నిందితుల వద్ద నుంచి పోలీసులు 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇన్స్పెక్టర్ పి. శివ చంద్ర నేతృత్వంలో ఎస్ఐ ఎ. ఉమ, హెచ్.సి సునీల్ కుమార్, పి. సిలు గణేష్ సందీప్, విజయ్ కుమార్, మనీష్ కుమార్, ధరణి, శివ కుమార్ ఈ కేసును ఛేదించారు. సోషల్ మీడియాలో వచ్చే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అనే బెట్టింగ్ ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయకుండా, అనధికారిక యాప్లను డౌన్లోడ్ చేయకుండా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు