
హైదరాబాద్, 11 మార్చి (హి.స.)బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేటీఆర్.. ముందు క్షమాపణలు చెప్పి మాట్లాడాలని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకున్నారని.. మండలి చైర్మన్ పదవి లాగేసుకున్నారని గుర్తుచేశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలకు నేరుగా మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేటీఆర్ నీతి మంతుడైనట్టు మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ తన పరిధి మేరకే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ‘బీఆర్ఎస్ తీసుకుంటే అభివృద్ధి కోసం.. కాంగ్రెస్ తీసుకుంటే ప్రజాస్వామ్యంపై దాడా’ అంటూ మంత్రి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలని అంటూ మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్