
మేడ్చల్ మల్కాజ్గిరి, 11 మార్చి (హి.స.)
పదో తరగతి పరీక్షలకు అధికార
యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 15 వరకు కొనసాగుతాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 903 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన మొత్తం 49,999 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 1,032 మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్ష రాయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 ລ້ పరీక్షలు జరగనున్నాయి.
ఈ సంవత్సరం తెలుగు, హిందీ, ఇంగ్లీషు మూడు భాషా పేపర్లు పూర్తయిన రోజునే వాటి పేపర్ వాల్యుయేషన్ చేపట్టనున్నారు. అదేవిధంగా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్నికేంద్రాలలో డ్యూయల్ డెస్క్ లు తప్పనిసరి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతీ విద్యార్థికి 24 పేజీల బుక్ లెట్ అందజేసి, అందులోనే అన్ని సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అబ్జెక్టివ్ ప్రశ్న పత్రాల పంపిణీ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. ఫిజిక్స్, బయాలజీ పరీక్షకు 15 నిమిషాల ముందు, ఇంగ్లీషు పరీక్షకు ప్రారంభంలోనే తెలుగు,హిందీ, సోషల్, గణితం పరీక్షల సమయంలో 30 నిమిషాల ముందు అబ్జెక్టివ్ పేపరు అందజేయనున్నారు.
పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 237 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ చొప్పున 237 మంది కేటాయించారు. పరీక్షల నిర్వహణ కోసం సీఎస్, డీవో, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 2,769 మందిని నియమించారు.వీరిలో 25 మంది జాయింట్ కస్టోడియన్లను, 21 మంది అదనపు కస్టోడియన్లను,8 మంది రూట్ ఆఫీసర్లు ఉన్నారు. జిల్లా పరిధిలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 పోలీస్ స్టేషన్లు, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని 11 పోలీస్ స్టేషన్లు కలిపి మొత్తం 21 పోలీస్ స్టేషన్ల నుంచి 8 రూట్లలో పక్కా బందోబస్తు మధ్య పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు