
నాగర్ కర్నూల్, 11 మార్చి (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజాపాలనలోనే అభివృద్ధికి బాటలు పడుతున్నాయని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్, నీటి సరఫరా కోసం కొత్తగా వహించిన బోరు బావిని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను చీపురుతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ప్రభుత్వం మూడోసారి ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోందన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పేరిట చేపడుతున్న 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కోసం ప్రత్యేక లోగోను రూపొందించారని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్ శంకర్, మాజీ కౌన్సిలర్లు కావలి శ్రీను, ఖాజా ఖాన్, జక్కా రాజు, కాంగ్రెస్ నాయకులు బాదం నరేందర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు