
భద్రాచలం 12 మార్చి (హి.స.)
, శ్రీరామ నామమే పరమ పావనం అని హైదరాబాద్కు చెందిన భక్తులు విశ్వసిస్తున్నారు. శ్రీరామనవమికి భద్రాచలం వచ్చి నిండు మనస్సుతో తమకు తోచిన బహుమతి అందిస్తూ సంతోషంగా గడుపుతున్నారు. వందేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మొదట్లో దుకాణాల్లో వస్త్రాలను కొని తీసుకొచ్చేవారు. గడిచిన ఐదేళ్లుగా భద్రాచలం వచ్చి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి సమక్షంలో నిత్యం రామనామం జపిస్తూ వస్త్రాలను తయారుచేసి కానుకగా అందిస్తున్నారు.
అంతకుముందు ఏడేళ్లు స్వస్థలంలో నేతన్నలు నేచిన పట్టువస్త్రాలను తెచ్చి దేవదేవుడికి ఇచ్చారు. ఈనెల 27న శ్రీరామనవమి వార్షిక కల్యాణం జరగనుండటంతో మరో రెండు రోజుల్లో భద్రాచలం చేరుకుని నేత పనులు ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ గణేశ్ ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎస్ఎస్ జయరాజు ఆధ్వర్యంలో ఈ క్రతువు జరగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ