
హైదరాబాద్, 12 మార్చి (హి.స.)తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో హాఫ్డే స్కూల్స్ అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ.నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 23, 2026 వరకూ అన్ని పాఠశాలలు హాఫ్డే విధానంలో నడుస్తాయి
విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (మిడ్డే మీల్స్) మధ్యాహ్నం 12.30 గంటలకు అందజేస్తారు. ఇక పదో తరగతి (SSC) విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. తద్వారా మార్చి 2026లో జరిగే పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు.
అలాగే SSC పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు పరీక్ష జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకూ పనిచేస్తాయి. మిగతా రోజుల్లో మాత్రం సాధారణ హాఫ్ డే టైమింగ్స్ను పాటిస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్