
ఆదిలాబాద్, 12 మార్చి (హి.స.)
ఆదిలాబాద్ జిల్లాలో వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
మార్చి మొదటి వారంలోనే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే ఎండలు మొదలవుతుండడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోత పెరగడంతో అత్యవసర పనులపై బయటకు వచ్చే వారు మాస్కులు, క్యాపులు ధరిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు జన సంచారం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఎండల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు చల్లని పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు ఇళ్లలోనే కూలర్లు, ఫ్యాన్ల కింద సేదతీరుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని తాగాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి అంటూ వైద్యాధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..