
హైదరాబాద్, 12 మార్చి (హి.స.)
ప్రజా ప్రతినిధులు వారి హక్కులను,బాధ్యతలను, చట్టాలను తెలుసుకొని తమ ప్రాంత ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సర్పంచులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కందిలో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ఒక మహత్తర కార్యక్రమాన్ని తీసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి సాహసం చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పది అంశాలపై గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల అమలు, నిధుల సమీకరణ, ప్రజా ప్రతినిధుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతి ప్రజా ప్రతినిధి అన్ని అంశాలపై అవగాహనను పెంచుకొని అంకితభావంతో తమ ప్రాంతంలో గెలిపించిన ప్రజలకు, పార్టీలకు అతీతంగా సేవలను అందించాలని పిలుపునిచ్చారు కనీస సౌకర్యాలైన రోడ్లు, విద్యుత్, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వంటి అంశాలకు ముందుగా ప్రాధాన్యతనిచ్చి ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు