యూరియా కోసం రైతుల ఆగ్రహం.. బస్తాల పై పెట్రోల్ పోసి నిరసన
రాజన్న సిరిసిల్ల, 12 మార్చి (హి.స.)యూరియా ఎరువు కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు మరోసారి బయటపడ్డాయి. యూరియా అందుబాటులో లేకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంభీరావుపేట మండలానికి చెందిన కొందరు రైతు
Urea


రాజన్న సిరిసిల్ల, 12 మార్చి (హి.స.)యూరియా ఎరువు కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు మరోసారి బయటపడ్డాయి. యూరియా అందుబాటులో లేకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంభీరావుపేట మండలానికి చెందిన కొందరు రైతులు బుధవారం ఉదయం ఫర్టిలైజర్ యాప్లో యూరియా బుక్ చేసుకున్నారు. బుక్ చేసిన రైతులు ముస్తాబాద్ మండలం పోతుగల్ సొసైటీకి వెళ్లగా అక్కడ యూరియా లేదని, ఆవునూరు గూడెం సొసైటీకి వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో రైతులు గూడెం సొసైటీకి చేరుకున్నారు. అయితే గూడెం గ్రామ రైతులు తమ గ్రామానికి కేటాయించిన యూరియాను గంభీరావుపేట మండలానికి చెందిన రైతులకు ఎలా ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో ఇరువర్గాల రైతుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రైతులు ఆగ్రహంతో కొందరు యూరియా బస్తాలపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని హెచ్చరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు గంటపాటు ఘర్షణ వాతావరణం కొనసాగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను శాంతింపజేశారు. అనంతరం యాప్లో బుక్ చేసుకున్న రైతులకు యూరియా బస్తాలను అందజేశారు. ఈ సంఘటన రైతులు యూరియా కోసం ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో స్పష్టంగా తెలియజేస్తోంది. యాప్ల ద్వారా కాకుండా రైతులకు నేరుగా ఎరువులు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande