
అమరావతి, 13 మార్చి (హి.స.):ఫీజుల విడుదల ప్రక్రియలో పెట్టిన ‘వడ్డీ’ మినహాయింపు మెలిక, దాదాపు నెల రోజుల జాప్యంపై వచ్చిన విమర్శలతో ఉన్నత విద్యా శాఖ అధికారులు పొరపాటును సరిదిద్దుకున్నారు. కాలేజీ యాజమాన్యాల 1200 ఫిర్యాదులపై సీఎం స్పందనతో ఎట్టకేలకు కోతల్లేకుండా మొత్తం ఫీజుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. 2024-25కి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు ప్రభుత్వం ఫిబ్రవరి 10న రూ.1,200 కోట్ల విడుదలకు బీఆర్వోలు విడుదల చేసింది. దీంతో వెంటనే ఫీజులు తమ ఖాతాల్లో జమవుతాయని కాలేజీ యాజమాన్యాలు ఆశించాయి. కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇక్కడొక మెలిక పెట్టారు. ప్రభుత్వం వద్ద నిధుల్లేకపోయినా రుణాలు తీసుకొచ్చి బకాయిలు ఇస్తున్నందున.. ఆ రుణంపై 7.5 శాతం వడ్డీ కాలేజీలు భరించాలని ప్రతిపాదన పెట్టారు. పైస్థాయి ఆదేశాలతో ఈ ప్రతిపాదన పెట్టారా? లేక అధికారుల నిర్ణయమా? అనేదానిపై తీవ్ర చర్చ జరిగింది. అనంతరం ఈ ప్రతిపాదనపై పలు దఫాలుగా యాజమాన్యాలతో అధికారులు చర్చలు జరిపారు. ఓ దశలో ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకున్నట్లుగా అగ్రిమెంట్ రాయాలని కాలేజీలకు ప్రతిపాదించారు. దీనిని యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ