
హైదరాబాద్, 13 మార్చి (హి.స.)
నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలు రాజకీయ వివాదానికి దారితీశాయి. బంజారాహిల్స్లోని విరించి ఆసుపత్రి ఎదుట ఎంఐఎం (MIM) పార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నేత మాధవీలత (Madhavi Latha) చించివేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆమె ఎంఐఎం నేతలపై ఘాటు విమర్శలు చేశారు. ఇఫ్తార్ విందుల నిర్వహణ తీరుపై మాధవీలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ ఇఫ్తార్ విందు అంటే ఏసీ గదుల్లో, ఫంక్షన్ హాళ్లలో కేవలం ధనవంతులకు ఇచ్చేది కాదని అన్నారు. ఎంఐఎం నేతలు రంజాన్ పవిత్ర మాసపు అంతరార్థాన్ని పూర్తిగా విస్మరించారని ఫైర్ అయ్యారు. కేవలం ప్రదర్శన కోసం చేసే ఇటువంటి విందులు రంజాన్ స్ఫూర్తికే విరుద్ధమని కామెంట్ చేశారు.
నిజమైన ఇఫ్తార్ విందులు అనాథ ఆశ్రమాల్లోని అభాగ్యులకు, ఆకలితో ఉన్న పేదలకు అందాలని మాధవీలత అన్నారు. రంజాన్ విశిష్టత, ఇఫ్తార్ (Iftar) అంటే ఏంటో ఎంఐఎం నేతలు ముందుగా తెలుసుకోవాలని హితబోధ చేశారు. కేవలం రాజకీయ పబ్లిసిటీ కోసం ఫ్లెక్సీలు వేసి హడావుడి చేయడం రంజాన్ విశిష్టతను తగ్గించడమేనని విమర్శించారు. ఈ ఘటనతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..