
హైదరాబాద్, 13 మార్చి (హి.స.)గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రప్రభుత్వమే కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్రప్రభుత్వ వైఫల్యంతోనే గ్యాస్ సమస్య వచ్చిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో గ్యాస్ కొరతపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు(శుక్రవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. యుద్ధం నేపథ్యంలో కేంద్రం తక్షణం స్పందించాలని పట్టుబట్టారు. మూసీపై తెలంగాణ ప్రభుత్వానికి ఓ విజన్ ఉందని స్పష్టం చేశారు. పీపీటీ ద్వారా అన్ని అనుమానాలు నివృత్తి చేస్తామని తెలిపారు. మూసీపై గాంధీ మనవడు తుషార్ గాంధీకి తప్పుడు సమాచారం అందినట్లుందని అన్నారు.
మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా కల్పించారు. మూసీ పరిసరాలను కాలుష్యం లేకుండా సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మూసీ విషయంలో తమ ప్రభుత్వం అజెండా తెలపడానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. మూసీపై ప్రతిపక్షాల నేతలు అనవసరపు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ తెలంగాణలో ఒక అజెండాతో ఉందని.. దేశవ్యాప్తంగా మరో అజెండాతో ఉందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలకు తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు లేదని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని ఆగ్రహించారు. ఎలక్ట్రిక్ బస్సులను అమల్లోకి తీసుకురావడం కేంద్రప్రభుత్వం నిర్ణయమని తెలిపారు. అసెంబ్లీలో అన్నింటికి తాము సమాధానం చెబుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్