గ్యాస్ మాఫియాపై SOT పోలీసుల స్పెషల్ ఫోకస్.. అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలపై మెరుపు దాడులు
హైదరాబాద్, 13 మార్చి (హి.స.)నగరంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ముఠాలపై ఎస్వోటీ (Special Operations Team) పోలీసులు కొరడా ఝుళిపించారు. ఇవాళ తెల్లవారుజామున గోషామహల్, బేగంబజార్ పరిధిలోని పలు అక్రమ రీఫిల్లింగ్ స్టేషన్లపై పోలీసులు ఏకకా
Gyas Mafia


హైదరాబాద్, 13 మార్చి (హి.స.)నగరంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ముఠాలపై ఎస్వోటీ (Special Operations Team) పోలీసులు కొరడా ఝుళిపించారు. ఇవాళ తెల్లవారుజామున గోషామహల్, బేగంబజార్ పరిధిలోని పలు అక్రమ రీఫిల్లింగ్ స్టేషన్లపై పోలీసులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్యాస్ కొరతను కొందరు ఏజెన్సీ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ ధర కంటే ఐదు రెట్లు అధికంగా, అంటే ఒక్కో సిలిండర్ను బ్లాక్లో రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా గృహ అవసరాలకు వాడే పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ మళ్లిస్తూ, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్రాలను పోలీసులు గుర్తించారు.

బేగంబజార్ లోని పలు ఇరుకు గల్లీలలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ రీఫిల్లింగ్ దందాపై ఎస్వోటీ పోలీసులు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో దాడులు చేసి, భారీగా సిలిండర్లను సీజ్ చేయడంతో పాటు అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande