
ఆసిఫాబాద్, 13 మార్చి (హి.స.)
జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్
పాటు కాగజ్ నగర్ రెండు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్యూరి పై వాటర్” వంటి పేర్లతో సాధారణ నీటిని మినరల్ వాటర్ అని ప్రజలకు సరఫరా చేసి మోసం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్లను నిర్వహించినా, సంబంధిత అధికారులు దీనిపై పట్టించుకోవట్లేదు. జిల్లాలో దాదాపు 80కి పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నప్పటికీ, వాటిలో కొన్నింటికి మాత్రమే ఎస్ఎస్ఐ, ఐఎస్ఐ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. మిగతా ప్లాంట్లు రోజు వేల లీటర్ల నీటిని విక్రయించి లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఈ నీటిని తాగిన వారికి అనేక ఆరోగ్య సమస్యలు రావడం సాధారణం అయింది.
మినరల్ వాటర్ పేరుతో వాటర్ ప్లాంట్ యాజమాన్యాలు నీటిని శుద్ధి చేయకుండానే క్యాన్లలో నింపి లాభం పొందుతున్నారు. నీటిని నిల్వ చేసే ట్యాంక్లను నెలల తరబడి శుభ్రం చేయకపోవడం, నాణ్యతకు హానికరంగా మారింది. నీటిని శుద్ధి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం క్యాన్ల పై తేదీ వివరాలను స్టిక్కర్ చేయాలి. కానీ ప్లాంట్ యాజమాన్యాలు ఈ నియమాన్ని పాటించడం లేదు. కనీసం ప్లాంట్ వద్ద అర్హత గల ల్యాబ్ టెక్నీషియన్ ఉండి, రోజూ నీటిని పరీక్షించి కాలుష్యం, మెగ్నీషియం మోతాదులు పరీక్షించిన తర్వాత మాత్రమే నీటిని సరఫరా చేయాలి. కానీ కొందరు అపరిశుభ్రమైన నల్లాల ద్వారా వచ్చే నీటిలో రసాయనాలు కలిపి, ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారు.
వాటర్ ప్లాంట్లు ఐఎస్ఐ అనుమతి పొందాలంటే 1 లక్షవరకు ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతి నెల పర్యవేక్షణ కొరకు 10,000, సంవత్సరానికి ఒక్కసారి రెన్యువల్ కోసం 50,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించకుండా, ప్లాంట్ నిర్వాహకులు సంబంధిత శాఖలోని కొంతమంది అధికారులకు ముడుపులు చెల్లించి, ఇష్టానుసారం నీటిని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూలు మత్తులో పట్టించుకోకుండా వ్వవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక నాయకులు అధికారులు వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని కోరుతున్నారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు