
సింహాచలం,, 14 మార్చి (హి.స.), సింహాద్రి అప్పన్న స్వామి భక్తులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరూర్ వైశ్యా బ్యాంకు సహకారంతో సెల్ఫ్ సర్వీస్ కియోస్క్లను దేవస్థానం అధికారులు నెలకొల్పారు. ఆయా కియోస్క్లను శుక్రవారం సింహగిరిపై ఈవో కె.వెంకటరావు, కరూర్ వైశ్యా బ్యాంకు డివిజినల్ మేనేజర్ ఎన్.మురళీకృష్ణ, సీనియర్ మేనేజర్ హెచ్ఎస్ఎన్వీఆర్ మూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ కియోస్క్లు ద్వారా ప్రాథమికంగా భక్తులకు దర్శనం టికెట్లు, ఈ-హుండీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలుత అర్చకులు యంత్రాలకు పూజలు చేశారు. ఈవో, బ్యాంకు అధికారులు రిబ్బను కత్తిరించి సేవలను ప్రారంభించారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కరూర్ వైశ్యా బ్యాంకు ఎనిమిది కియోస్క్లను దేవస్థానానికి సమకూర్చింది. వీటిలో నాలుగు కియోస్క్లను శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటి ద్వారా తొలి విడతగా రూ.300, రూ.100 దర్శనం టికెట్లతో పాటు ఈ-హుండీ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. డిజిటల్ సేవలు అందబాటులోకి వచ్చిన నేపథ్యంలో దర్శనం టికెట్ల కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుందని ఈవో జె.వెంకటరావు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ