
హైదరాబాద్, 14 మార్చి (హి.స.)మరో ఆరు నెలల్లో స్థానికసంస్థల ఎన్నికలు వస్తాయని, ఏ ఎన్నికలైనా మనమే గెలవాలన్న లక్ష్యంతో పనిచేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని తెలిపారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ ముగిశాక మంత్రులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శుల పనితీరుపై ఏప్రిల్ 2న కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు ఇస్తామని సీఎం చెప్పారు. దస్త్రాల పరిష్కారం, కీలక పనితీరు సూచీలు (కేపీఐ) లక్ష్యాలను చేరుకోవడం, సాధించిన విజయాలు, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం, ఖర్చుచేయడంలో చూపించిన చొరవ లాంటి అంశాల ఆధారంగా నివేదికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఈ రెండేళ్లలో పరిస్థితులన్నీ ఒక దారికి తేగలిగామని, ఇక అభివృద్ధి ఊపందుకోవాలని, 2026-27 కీలక మైలురాయి కావాలని ఆయన పేర్కొన్నారు. మంత్రులు విరివిగా పర్యటనలు చేసి, సమీక్షలు నిర్వహించాలని సూచించారు.
చేసింది చెప్పకపోతే ఎలా?
చాలామంది మంత్రులు తమ శాఖల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాల గురించి ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నారని, సామాజిక మాధ్యమాల్ని సరిగ్గా వినియోగించుకోవడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మీ శాఖల పరిధిలో ఏం చేశామన్నది చెప్పుకోవాలి కదా? వాళ్లు (వైకాపా) చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పటికి కొంత గాడిన పెట్టగలిగాం. ఇక మీరు స్పీడ్ పెంచాలి. మీరు సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే మెరుగైన ఫలితాలను సాధించగలం’’ అని సీఎం తెలిపారు. తెదేపా కార్యాలయం నుంచి పంపించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంలో మంత్రులు వెనకబడుతున్నారని, దీన్ని సరిచేసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్