
ములుగు, 14 మార్చి (హి.స.)
నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాను ఎంపిక చేశారు. ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని శనివారం నాడు ఢిల్లీలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు జెండర్-రెస్పాన్సివ్ మౌలిక సదుపాయాలు, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని కేంద్రమంత్రికి సీతక్క తెలిపారు. తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'పాలనా' పథకంలో పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం క్రెచ్ వర్కర్లకు నెలకు రూ. 5,500, హెల్పర్లకు రూ.3,000 మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తున్నారని, ఇది వారు చేసే పనికి, బాధ్యతకు ఏమాత్రం సరిపోదని గౌరవ వేతనం పెంచాలని కోరారు. మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్న సిబ్బంది ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని, కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..