
షాద్నగర్, 14 మార్చి (హి.స.)
షాద్నగర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మున్సిపాలిటీ లోని జానమ్మ చెరువు అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు అవసరమైన నిధులను కేటాయించి ప్రజలకు మౌలిక వసతులు కల్పించి, అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు.
ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆడబిడ్డల వివాహాలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని ఫరూఖ్నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడెం మండలాలకు చెందిన లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
ఫరూఖ్నగర్ మండలానికి చెందిన 78 మంది, కొందుర్గు మండలానికి చెందిన 44 మంది, జిల్లేడు చౌదరిగూడెం మండలానికి చెందిన 38 మంది మొత్తం 160 మంది లబ్ధిదారులకు రూ. 1,60,18,560 విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక భరోసా షాదీ ముబారక్,కళ్యాణ లక్ష్మి పథకాలేనని అన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని వారు శంకర్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న కూరగాయ విత్తనాలను వేసవిలో రైతులు సాగు చేసి కూరగాయల దిగుబడిని పెంచాలని ఎమ్మెల్యే సూచించారు. స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కూరగాయ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు కూరగాయ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీపై అందజేస్తున్న కూరగాయ విత్తనాలను సాగు చేసి దిగుబడులను పెంచాలని అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులకు (ఐఐహెన్ఆర్) టమాటా, చిక్కుడు, మిరప, సొరకాయ వంటి కూరగాయ విత్తనాలను అర ఎకరానికి సరిపడే కిట్లుగా అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..