
వరంగల్, 14 మార్చి (హి.స.)
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే మూడు పార్టీల నేతలు రంగంలోకి దిగుతున్నారు. డివిజన్ల వారీగా ఫోకస్ పెట్టడంతో పాటు రిజర్వేషన్లకు అనుగుణంగా బలం, బలగం, అంగబలం, అర్థబలం ఉన్న నేతలను రంగంలోకి దించేందుకు ఎత్తులు వేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పట్టు నిలుపుకునేందుకు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. బడా నేతలు, వ్యాపారులు, బిల్డర్లు, వైద్యులు, న్యాయవాదులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం మే 9న ముగుస్తుంది. ఆ తర్వాతనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. పాలకవర్గం పదవీకాలం ముగుస్తుండటంతో పార్టీల నేతలు ఎన్నికలపై దృష్టి పెట్టారు. అధికార కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టగా ధీటుగానే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో మూడు పార్టీల నేతల చూపు ఈ కార్పొరేషన్ పైనే ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలో నాలుగు నియోజకవర్గాలు ఉండటంతో ఈ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉండనుండటంతో పార్టీల నేతలు నజర్ పెట్టడంతో పాటు పూర్తి స్థాయిలో పక్కా ప్రణాళికతో ఎన్నికల్లో దిగేందుకు సిద్ధమవుతున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ముందస్తుగానే ఎన్నికలపై దృష్టి పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నారు. పాలకవర్గం పదవీకాలం పూర్తయ్యేలోపు భద్రకాళి ట్యాంక్ బండ్, మాడవీధులు, చెరువు పనులు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం రూ.5257 కోట్లతో అనుమతులు ఇచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రోడ్లు, ఇతర పనులను పూర్తి చేయడంతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు జూన్ 2న ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పై ఇద్దరు మంత్రులతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో గెలిచే అభ్యర్థులను రిజర్వేషన్ కు అనుగుణంగా ఎంపిక చేసి బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో దీర్ఘకాలికంగా ఉన్నవారితో పాటు గెలిచే వారికే ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పనులు పూర్తికాగానే సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ నేతలు ఈ దఫా కూడా నిశబ్దంగానే పనిచేస్తున్నారు. డివిజన్ల వారీగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పార్టీ నేతల ఆధ్వర్యంలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. గెలిచే అభ్యర్థులను గుర్తించడంతో పాటు వారిని పోటీ చేయించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్ పీఠమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు ఇతర నేతల ఆధ్వర్యంలో కసరత్తు చేస్తున్నారు. పార్టీలో పనిచేసిన నేతలతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న నేతలకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల లోపే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తో సభలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.
కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ లో అనుసరించిన విధంగానే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో బీజేపీ కార్యక్రమాలు చేపడుతుంది. అస్సాం మోడల్ ను ముందుకు తీసుకురావడంతో పాటు డివిజన్ల వారీగా ఇన్చార్జిలను నియమించి ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది. 25 మంది ఓటర్లకు ఒకరిని ఇంచార్జిగా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ, అనుబంధ సంఘాల నేతలను రంగంలోకి దించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. ఒకటి రెండు నెలల్లో ప్రధాని మోడీ వరంగల్ కు రానుండటంతో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని మామునూర్ ఎయిర్ పోర్టు శంకుస్థాపన, కాకతీయ టెక్స్ టైల్ ప్రారంభం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించనుండటంతో ఆరోజు సభ నిర్వహించి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పై మూడు పార్టీలు నజర్ పెట్టడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు