
అమరావతి, 15 మార్చి (హి.స.) రాష్ట్రంలో వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ దిగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కూడా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సమస్య తీవ్రతపై సీఎం చంద్రబాబు స్పందించారు. శనివారం ఉదయం అందుబాటులో ఉన్న పలువురు మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ఆరా తీశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజలు ఆందోళన చెందకుండా ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. ఎంత మేరకు చేయగలమో అంతా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు హోటళ్ల నిర్వాహకులు, భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ