
హైదరాబాద్,, 15 మార్చి (హి.స.)
చందానగర్, మెడలో స్టెతస్కోప్.. ఒంటిపై తెల్ల కోటు ధరించి.. వైద్యురాలిగా నటిస్తూ ప్రముఖ ఆసుపత్రుల్లోకి వెళ్లి రోగుల ఒంటి మీద ఆభరణాలు కొట్టేస్తోంది ఓ మహిళ. వారం వ్యవధిలో నగరంలోని మూడు ఆసుపత్రుల్లో రూ.లక్షల విలువైన బంగారం కాజేసిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలానికి చెందినగుండ్ల శిరీష(25) గతంలో ఫార్మా-డీ కోర్సు పూర్తిచేసింది. వివాహితురాలైన ఈమె డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం ప్రారంభించింది. మత్తు మందు ఇవ్వడంలో ప్రావీణ్యం సంపాదించిన శిరీష.. వైద్యురాలిగా నటిస్తూ ప్రముఖ ఆసుపత్రుల్లోకి వెళ్తుంది. వైద్యురాలిగా వార్డులు పరిశీలిస్తూ రిసెప్షన్ సిబ్బంది దగ్గర రోగుల వివరాలు సేకరిస్తుంది.
బంగారు ఆభరణాలు ఎక్కువగా.. ఒంటరిగా ఉండే రోగుల్ని గుర్తించి వారితో మాట్లాడుతుంది. వైద్యంలో భాగమంటూ మత్తు మందు ఇస్తుంది. స్పృహ కోల్పోయాక బంగారు ఆభరణాలు తీసుకెళ్తుంది. ఈ నెల 10న నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రిలో అరుణ అనే రోగికి మత్తుమందు ఇచ్చి సుమారు రూ.24లక్షల విలువైన 15 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసింది. ఈ నెల 11న సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోనూ సుధారాణి అనే రోగికి మత్తు మందు ఇచ్చి పది తులాల బంగారు ఆభరణాలతో పారిపోయింది. పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకొని.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా శిరీషను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇలాంటి చోరీలు చేసినట్లు తెలుసుకున్నారు. నిందితురాలిని ప్రస్తుతం విచారిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ