
కాణిపాకం 15 మార్చి (హి.స.), : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి గుడికి కొత్తగా కోనేరు నిర్మించాలని ఆలయ పాలకమండలి నిర్ణయించింది. ఈ ఆలయానికి మూడు వైపులా మాడవీధులు విశాలంగా ఉన్నా, ముందువైపు పుష్కరిణి కారణంగా బ్రహ్మోత్సవాల వేళ వాహన సేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పుష్కరిణిని పూడ్చివేసి, సమీపంలోనే సుపథ మండపానికి 60 అడుగుల దూరంలో మరిన్ని హంగులతో నూతన సరోవరాన్ని రూ.3.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అక్కడున్న భవనాలను తొలగించనున్నారు. ఈ పనులకు దేవాదాయశాఖ అనుమతి లభించింది. కొత్త పుష్కరిణికి ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి, వెంటనే పనులు ప్రారంభిస్తామని, ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి తెస్తామని ఆలయ పాలకమండలి ఛైర్మన్ ఎం.మణినాయుడు, ఈవో పెంచల కిశోర్ ‘న్యూస్టుడే’కు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ