
అమరావతి, 15 మార్చి (హి.స.), విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నిర్వాకంతో సోదరులు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఒకరు మరణించగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం జాతీయ రహదారిపై ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో ఆదివారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కేసరపల్లి నుంచి పెద్దఅవుటుపల్లి సోదరులు ప్రణయ్ (21), కౌశిక్ (16) వెళ్తున్నారు. చెక్ పోస్ట్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కి మళ్లించేందుకు వారు ప్రయత్నించారు. ఆ సమీపంలోనే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పరిగెత్తుకొంటూ వచ్చి.. స్కూటీని బలంగా తన్నాడు.
అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఐసర్ వాహనాన్ని స్కూటీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సోదరులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసులు వారిని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అన్నయ్య ప్రణయ్ మరణించాడు. తమ్ముడు కౌశిక్ పరిస్థితి సైతం విషయంగానే ఉన్నట్లు సమాచారం. స్కూటీని తన్నిన పోలీస్ కానిస్టేబుల్ సీసీ ఫుటేజ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ