
కాకినాడ 15 మార్చి (హి.స.)కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత 16 రోజులుగా పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయందోళనలు సృష్టిస్తున్న ఈ పులి ప్రస్తుతం శంఖవరం మండలంలోని ఉరకొండ పరిసరాల్లో కనిపించినట్లు సమాచారం. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు అవి ఫలించలేదు. ఈ పరిస్థితి అధికారులకు పెను సవాల్గా మారింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షణ చేపట్టి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
16 రోజులుగా ఈ పెద్దపులి పలు గ్రామాల్లో సంచరిస్తోంది. మొదట అడవులకు సమీపంలోని గ్రామాల్లో కనిపించిన పులి, క్రమంగా మానవ నివాసాల దగ్గరకు రావడం ప్రజల్లో భయాందోళనలకు కారణమైంది. గ్రామస్థులు రాత్రి సమయంలో బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. కొంతమంది రైతులు తమ వ్యవసాయ పనులను వాయిదా వేసుకున్నారు. పశువులను బయట మేపేందుకు కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. అటవీశాఖ అధికారులు మొదటి రోజు నుంచే పులిని గుర్తించేందుకు, దాని కదలికలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేశారు. పులి అడుగుల ముద్రలు, కెమెరా ట్రాప్లు, స్థానికుల సమాచారం ఆధారంగా దాని సంచారాన్ని గమనిస్తున్నారు. అయినప్పటికీ పులి అధికారుల నుంచి తప్పించుకుంటోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ