
హైదరాబాద్, 15 మార్చి (హి.స.)
స్పైనల్ మస్క్యూలార్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్-2 వ్యాధితో బాధపడుతున్న ఘట్కేసర్ కు చెందిన ఆర్యాన్ (2) వైద్య చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరతానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆర్యామ్ తల్లిదండ్రులు ఘట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ ఈటల రాజేందర్ ను ఆయన నివాసంలో కలిశారు. ఆర్యార్ష్ బాధపడుతున్న ఎస్ఎంఏ టైప్-2 వ్యాధి గురించి వివరించారు. ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధి చికిత్స రూ.కోట్లతో కూడుకోవడం బాధాకరమని, ఇదే వ్యాధి ఆంధ్రప్రదేశ్ లోని పునర్విక అనే చిన్నారికి వస్తే ప్రజలే విరివిగా విరాళాలు ఇచ్చి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడిన దేవుళ్ళు అయ్యారని ఎంపీ ఈటల అన్నారు. ఆర్థిక సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని, తన వంతుగా కూడా ఆర్థిక సాయం అందజేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆర్యాన్ కోసం విరాళాలు అందించడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు